దుమ్మురేపిన దీప్తి, చెక్ పెట్టిన చరణి.. భారత్ చేతిలో ఘోరంగా ఓడిన పాక్

దుమ్మురేపిన దీప్తి, చెక్ పెట్టిన చరణి.. భారత్ చేతిలో ఘోరంగా ఓడిన పాక్

IND-W vs PAK-W: మహిళల టీ20 ప్రపంచకప్‌ (WT20 World Cup 2026 ) లో ఉమెన్ ఇన్ బ్లూ జట్టు ఊహించినట్లుగానే పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి టోర్నీని గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు.. భారత స్పిన్ మ్యాజిక్‌కు తట్టుకోలేక కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 64 పరుగుల భారీ తేడాతో పాక్‌ను మట్టికరిపించి టోర్నీలో బోణీ కొట్టింది.

5 వికెట్లతో చెలరేగిన దీప్తి శర్మ: 
171 రన్స్ చేజింగ్‌లో పాకిస్తాన్ ఓపెనర్లు ఆరంభంలో కాస్త దూకుడుగా ఆడినప్పటికీ, భారత స్పిన్నర్ దీప్తి శర్మ బంతిని చేతిలోకి తీసుకున్నాక మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. పక్కా లైన్ అండ్ లెంగ్త్‌తో పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన దీప్తి.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాక్ నడుం విరిచింది. ఆమెకు తోడుగా శ్రీచరణి 3 వికెట్లు తీయడం, భారతి ఫుల్మాలి సూపర్ రనౌట్‌తో మునీబా అలీ (41) ని అవుట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ 106 పరుగులకే కుప్పకూలింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా డకౌట్ కాగా, నటాలియా (7) తో పాటు మిగతా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

మంధాన, రిచా ఘోష్ ధమాకా!
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ మొదటి బంతికే సిక్స్ కొట్టి అవుట్ అవ్వడం, జెమీమా (1) నిరాశపరచడంతో తొలి ఐదు ఓవర్లలో స్వల్ప ఒత్తిడి నెలకొంది. కానీ, ఆ తర్వాత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లాస్ బ్యాటింగ్‌తో చెలరేగి హాఫ్ సెంచరీ (68 రన్స్) తో జట్టును ఆదుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36) తో కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక చివర్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ పాక్ బౌలర్లను ఉతికి ఆరారేసింది. ముఖ్యంగా 19వ ఓవర్లోనే 23 పరుగులు పిండుకుని కేవలం 17 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లి 34 రన్స్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.